బషీర్బాగ్, వెలుగు: రాష్ట్ర బడ్జెట్లో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం రూ.10 వేల కోట్లు కేటాయించాలని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొడుగు మహేశ్ యాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఫీజు బకాయిలు విడుదల చేయకుండా నిరుపేదలకు ప్రభుత్వం ఉన్నత చదువులను దూరం చేస్తున్నదని విమర్శించారు.
మూసీ సుందరీకరణకు వేల కోట్లు ఖర్చు చేసే ప్రభుత్వానికి రూ.7 వేల కోట్ల ఫీజు బకాయిలు తీర్చడానికి నిధులు లేవా అని ప్రశ్నించారు. గత రెండేండ్ల సంక్షేమ ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. బకాయిల విడుదల కోరుతూ ఈ నెల 15న ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఫీజు పోరు దీక్ష చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. కుందారం గణేవ్ చారి, కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, జాజుల లింగం గౌడ్, తారకేశ్వరి సహా పలువురు బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
